|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 06:23 PM
విలక్షణ నటనతో తమిళ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రసన్న (నటి స్నేహ భర్త), ఇప్పుడు తన చిరకాల కలలను నిజం చేసుకునే పనిలో పడ్డారు. నటనను కొనసాగిస్తూనే కమర్షియల్ పైలట్‌గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణుడిగా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త ప్రయాణానికి తనకు ప్రముఖ నటుడు అజిత్ కుమార్ స్ఫూర్తి అని ఆయన వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ, "ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకమైనది. ఎప్పటినుంచో నా బకెట్ లిస్ట్‌లో ఉన్న రెండు కోరికలను ఇప్పుడు బయటకు తీసి, వాటిని నిజం చేసుకుంటున్నాను" అని తెలిపారు. పాఠశాల రోజుల్లోనే పైలట్ కావాలని కలలు కన్నానని, అయితే నటనను కెరీర్‌గా ఎంచుకున్న తర్వాత ఆ కోరికను పక్కన పెట్టేశానని చెప్పారు. "వచ్చే ఏడాది ఇదే సమయానికి నేను ఫ్లైట్ స్కూల్ పాఠాలు పూర్తి చేసి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా సాధిస్తానని నమ్ముతున్నాను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ నిర్ణయానికి అజితే కారణమని ప్రసన్న స్పష్టం చేశారు. "‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో అజిత్ సర్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు, మోటార్ రేసింగ్‌పై ఆయనకున్న అభిరుచి, పట్టుదల నన్ను ఎంతగానో కదిలించాయి. నటనలో బిజీగా ఉన్నప్పటికీ, మన అభిరుచికి కూడా సమయం కేటాయించవచ్చని ఆయన్ను చూసే తెలుసుకున్నాను. ఆ స్ఫూర్తితోనే నేను కూడా నా కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తున్నాను" అని వివరించారు.
Latest News