|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:22 PM
చిరంజీవి చేసిన 'కమిట్‌మెంట్' వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలో నిబద్ధతతో పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చిరంజీవి పేర్కొనగా, ఆ 'కమిట్‌మెంట్' అనే పదానికి వాస్తవ పరిస్థితుల్లో మరో అర్థం ఉందని, ముఖ్యంగా మహిళల విషయంలో అది లైంగిక వేధింపులకు పర్యాయపదంగా మారిందని చిన్మయి అభిప్రాయపడ్డారు.ఇటీవల 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సక్సెస్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, సినీ పరిశ్రమ అద్దం లాంటిదని, మనం ఎంత నిబద్ధతతో పనిచేస్తే అంతే ఫలితం వస్తుందని అన్నారు. అవకాశాల కోసం తప్పుడు దారులు తొక్కాల్సిన అవసరం లేదని యువతకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి, చిరంజీవి తరం వేరని, అప్పటి పరిస్థితులు వేరుగా ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో 'కమిట్‌మెంట్' ఇస్తేనే అవకాశాలు వస్తాయని చెప్పేవాళ్లు ఉన్నారని, ఆ పదం వెనుక లైంగిక ఆశలు దాగి ఉన్నాయని ఆమె తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.ఓ మహిళా మ్యుజీషియన్ తాను ఎదుర్కొన్న వేధింపుల వల్ల ఆ రంగాన్నే విడిచిపెట్టిందని, తనతో గీత రచయిత వైరముత్తు ప్రవర్తించిన తీరును కూడా ఆమె గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు పరిశ్రమలో చాలా మందికి తెలిసినా మౌనంగా ఉంటున్నారని, బాధితులనే తప్పుపట్టే ధోరణి బాధ కలిగిస్తోందని చిన్మయి అన్నారు. అవకాశాల పేరుతో మహిళల పట్ల లైంగిక ఆశలు పెట్టుకునే పురుషులే అసలు సమస్య అని ఆమె స్పష్టం చేశారు.
Latest News