|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 05:46 PM
కరోనా అనే మాట వినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ మాట వినగానే, గతంలో చూసిన భయానక దృశ్యాలు కళ్లముందు కదలాడతాయి. మనసును తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి. అలాంటి కరోనా నేపథ్యంలో ఎమోషన్స్ తో కూడిన సినిమాలు .. కామెడీతో కూడిన కంటెంటులు చాలా వచ్చాయి. కరోనా నేపథ్యంలో నడిచే ప్రేమకథగా వచ్చిన సినిమానే 'సంధ్యానామ ఉపాసతే'. ఈ రోజు నుంచే ఈ సినిమా 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.కరోనా అనే మాటతో పాటు అందరినీ కంగారెత్తించిన మాటలు మరో రెండు ఉన్నాయి. ఒకటి 'క్వారంటైన్' అయితే మరొకటి 'లాక్ డౌన్'. ఆ సమయంలో నడిచే కథ ఇది. రామరాజు .. ఆయన మనవరాలు 'సంధ్య' (క్రిస్టన్ రవళి)కి కరోనా వస్తుంది. దాంతో వాళ్లు క్వారంటైన్ కి తరలించబడతారు. అప్పటికే అక్కడ మరో ఆరుగురు పేషంట్లు ఉంటారు. ఎవరికి వాళ్లు తమ వాళ్లకి కాల్ చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.అదే సమయంలో ఉదయ్ (వంశీ కిరణ్) కూడా క్వారంటైన్ కి వస్తాడు. అక్కడి వాళ్లలో తమకి కరోనా వచ్చిందనే భయం కన్నా, తమ వాళ్లకి దూరంగా ఉండవలసి వచ్చినందుకు బాధపడుతున్నారనే విషయాన్ని ఉదయ్ గ్రహిస్తాడు. వాళ్లలో భయం పోగొట్టడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే సంధ్యతో అతనికి సాన్నిహిత్యం పెరుగుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. తన పేరెంట్స్ తనకి ఒక సంబంధం చూశారనీ, సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేస్తారనే విషయం సంధ్యకి తెలుస్తుంది. అలాంటి పరిస్థితులలోనే ఆమెకి నెగెటివ్ రిపోర్టు రావడంతో క్వారంటైన్ నుంచి పంపించి వేస్తారు. ఉదయ్ కి పాజిటివ్ రావడంతో అక్కడే ఉంచేస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఉదయ్ బయటికి వస్తాడా? వాళ్ల పెళ్లి జరుగుతుందా? క్వారంటైన్ లో ఉన్నవారి జీవితాలలో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది మిగతా కథ.
Latest News