|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:29 PM
తమిళ సినీ నటుడు విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్రం విడుదల, సెన్సార్ సర్టిఫికెట్ విషయమై మద్రాస్ హైకోర్టులో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం చీఫ్ జస్టిస్ మహీంద్రన్ మోహన్ శ్రీవాత్సవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.'జన నాయగన్' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.సీబీఎఫ్‌సీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్ వాదనలు వినిపించారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి బోర్డుకు తగిన సమయం ఇవ్వలేదని, అదేవిధంగా సినిమాను మరోసారి సమీక్షించేందుకు రివిజన్ కమిటీకి పంపాలన్న సమాచారాన్ని నిర్మాతలు సవాల్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది సతీశ్ పరాశరన్ వాదనలు వినిపించారు. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత, బోర్డులోని ఒక సభ్యుడి అభిప్రాయం మేరకు సీబీఎఫ్‌సీ తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలిపారు. సీబీఎఫ్‌సీ సూచనల మేరకు నిర్మాతలు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించారని, అయితే తొలగించిన సన్నివేశాలనే మళ్లీ జోడించి తిరిగి వాటినే తొలగించాలని సీబీఎఫ్‌సీ కోరుతోందని కోర్టుకు విన్నవించారు. ఇది ఏమాత్రం సమంజసం కాదని, సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Latest News