|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:11 AM
బాలీవుడ్ సినిమాలకు ఈ మధ్య ఊహించని సమస్య ఎదురవుతోంది. దేశంలో ఘన విజయాన్ని సాధిస్తున్న కొన్ని సినిమాలకు విదేశాల్లో మాత్రం అనుకోని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న 'దురంధర్' సినిమా గల్ఫ్ లో విడుదలకు నోచుకోలేకపోయింది. సునిశిత అంశాల కారణంగా దాని విడుదలకు అక్కడి ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ సినిమా గల్ఫ్‌లో రిలీజ్ కాకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం జరిగింది. తాజాగా మరో మూవీకి కూడా అదే సమస్య వచ్చేలా ఉంది.రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23న 'బార్డర్ 2' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సన్నీడియోల్ హీరోగా నటించిన ఈ వార్ డ్రామాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్ కు మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది. అయితే 'బోర్డర్ 2' మూవీ గల్ఫ్ దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుందని తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రేన్ వంటి దేశాల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన 'బార్డర్ 2' సినిమా మొదటి భాగంతో పోలిస్తే విస్తృతమైన కథాంశంతో వస్తోంది. సన్నీడియోల్ తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ఇందులో కీలక పాత్రలు పోషించారు. సోనమ్ బజ్వా, మోనా సింగ్, మేధా రాణా, అన్యా సింగ్ సహాయ పాత్రల్లో కనిపించనున్నారు. సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా అతిథి పాత్రలలో మెరిశారు. దాంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో గల్ఫ్ దేశాల్లో సినిమా ప్రదర్శించకపోవడంతో వసూళ్ళలో భారీ కోత పడే ఆస్కరమూ ఉంది. మొత్తం మీద 'బార్డర్ 2' కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి!
Latest News