|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 03:12 PM
యాక్షన్ థ్రిల్లర్ 'అదర్స్'. అబిన్ హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆదిత్య మాధవన్ .. గౌరీ కిషన్ .. అంజు కురియన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, డిసెంబర్ 19వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి మాత్రమే తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. చెన్నైలోని 'మదురవోయాల్' ప్రాంతంలో తెల్లవారు జామున 3 గంటలకు ఒక ప్రమాదం జరుగుతుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ గా మాధవన్ (ఆదిత్య మాధవన్) రంగంలోకి దిగుతాడు. ప్రమాదానికి గురైన వ్యాన్ లో నలుగురు వ్యక్తులు చనిపోయి ఉంటారు. ముగ్గురు ఆడవాళ్లు .. ఒక పురుషుడికి సంబంధించిన మృతదేహాలు దొరుకుతాయి. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదనీ, డ్రైవర్ తప్పించుకున్నాడనే విషయాన్ని మాధవన్ గ్రహిస్తాడు. చనిపోయిన ముగ్గురు యువతులు పుట్టుకతో అంధులనీ, ప్రమాదానికి ముందే పురుషుడు చనిపోయాడంటూ పోస్టు మార్టం నివేదిక చెబుతుంది. దాంతో ఆ యువతులు ఏ శరణాలయానికి సంబంధించినవారు అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో మాధవన్ ఉంటాడు. అతనికి డాక్టర్ మధుమిత (గౌరీ కిషన్)తో కొంతకాలం క్రితం ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. ఆమె ఒక కార్పొరేట్ ఆఫీసులో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. అనురాధ అనే ఒక యువతికి ఆమె ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొదలుపెడుతుంది. అయితే ఊహించని విధంగా ఆ యువతికి రియాక్షన్ వస్తుంది. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు అంధ యువతులు, ఒక శరణాలయానికి చెందినవారనే విషయాన్ని మాధవన్ తెలుసుకుంటాడు. ఆ శరణాలయాన్ని జారా మిరియమ్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆమెను ప్రశ్నించడానికి మాధవన్ వెళ్లిన సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. మాధవన్ ఈ కేసు విషయంలో ఛార్లెస్ .. మారి .. వేదా పేర్లు వింటాడు. ఈ ముగ్గురూ ఎవరూ? అనాథ యువతులను వారు ఎందుకు టార్గెట్ చేశారు? వారికీ .. ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
Latest News