|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:09 PM
నటుడు ప్రకాశ్ రాజ్ కేవలం నటుడిగానే కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై (బాలీవుడ్) ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.కేరళలోని కోజికోడ్‌లో నిర్వహించిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్... బాలీవుడ్ ప్రస్తుతం తన అసలైన మూలాలను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైకి చూడటానికి హిందీ సినిమాలు చాలా రంగులమయంగా, భారీ సెట్లు, గ్లామర్‌తో కనిపిస్తున్నాయని, కానీ లోపల మాత్రం వాటికి ఆత్మ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.బాలీవుడ్ సినిమాలను ఆయన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాలతో పోల్చడం విశేషం. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలో జీవం ఉండదని చెప్పారు. మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన తర్వాత హిందీ సినిమా పరిశ్రమ కథలు, భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం లగ్జరీ లుక్స్, భారీ బడ్జెట్లు, మార్కెటింగ్, డబ్బు చుట్టూనే తిరుగుతోందని ఆయన విమర్శించారు.అదే సమయంలో దక్షిణాది సినిమా పరిశ్రమను ప్రకాశ్ రాజ్ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు మట్టి వాసన కలిగిన కథలను, సామాన్యుల జీవితాలను, అట్టడుగు వర్గాల సమస్యలను ఎంతో సహజంగా తెరపై చూపిస్తున్నాయని కొనియాడారు. దళితుల వేదన, సామాజిక అసమానతలు వంటి అంశాలను నిజాయతీగా చెప్పే ప్రయత్నం అక్కడి దర్శకులు చేస్తున్నారని చెప్పారు.‘మన వేర్లు మన కథల్లో ఉండాలి. ప్రాంతీయతను వదిలేసి కేవలం గ్లామర్ వెంటే పరిగెత్తితే ప్రేక్షకులు దూరమవుతారు’ అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
Latest News