|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:06 PM
‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ ఎన్నో ఆసక్తికర, భావోద్వేగ క్షణాలకు వేదికైంది. ఈ వేడుకలో దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రి చేసిన ప్రసంగం అందరినీ కదిలించింది. తన కుమారుడి జీవితంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన పంచుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అనిల్ రావిపూడి గుంటూరులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని ఆయన తండ్రి వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి వేదికలపై వైఫల్యాల గురించి మాట్లాడరని, కానీ అదే తన కొడుకు జీవితంలో కీలక మలుపు అని ఆయన పేర్కొన్నారు. అనిల్ చిన్నప్పటి నుంచీ చిరంజీవికి వీరాభిమాని అని, సినిమాలపై ఉన్న ఇష్టంతోనే చదువులో వెనుకబడ్డాడని తెలిపారు. ఆ సమయంలో తండ్రిగా తాను, "చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారనే చెడ్డపేరు ఆయనకు తీసుకురావద్దు" అని చెప్పిన ఒకే ఒక్క మాట అనిల్‌ను తీవ్రంగా ఆలోచింపజేసిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత పట్టుదలతో చదివి ఫస్ట్ క్లాస్ మార్కులతో సబ్జెక్టులు పూర్తి చేశాడని గర్వంగా చెప్పారు.
Latest News