|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:29 PM
ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. షేర్ మార్కెట్ పెట్టుబడుల వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా అమితోవ్ తనను కిడ్నాప్ చేసి, వేధించాడని బాధితుడు కె. ప్రణీత్ ఫిర్యాదు చేశారు.బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షకుడిగా పనిచేసే ప్రణీత్‌కు 2025లో అమితోవ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి షేర్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించగా, అందులో సుమారు రూ. 11 లక్షల నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని ప్రణీత్ భరించాలని అమితోవ్ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.నష్ట పరిహారం చెల్లించకపోవడంతో అమితోవ్, తన అనుచరులతో కలిసి 2025 మే 4న ప్రణీత్‌ను అక్రమంగా నిర్బంధించారని బాధితుడు ఆరోపించారు. బలవంతంగా ఖాళీ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకోవడమే కాకుండా, ప్రణీత్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించి ఆస్తి కాగితాలపై కూడా సంతకాలు చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.పోలీసులు మొదట స్పందించకపోవడంతో ప్రణీత్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అమితోవ్ తేజతో పాటు అతని అనుచరులు మణికుమార్, రామ్‌నాథ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డిలపై శుక్రవారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.అయితే, ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. ట్రేడింగ్ పేరుతో ప్రణీత్ దంపతులే తన దగ్గర రూ. 72 లక్షలు తీసుకొని మోసం చేశారని అమితోవ్ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు 20 రోజుల క్రితమే ప్రణీత్‌పై కేసు నమోదైంది. ఇప్పుడు పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Latest News