|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 04:03 PM
అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన చిత్రం ‘12ఎ రైల్వే కాలనీ’. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామాక్షి భాస్కర్ల సినిమా విశేషాలను పంచుకున్నారు.ఈ చిత్రం మంచి ప్రేమకథతో కూడిన ఒక బిగువైన కథనంతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ అని ఆమె తెలిపారు. "తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని రేకెత్తిస్తూ సినిమా సాగుతుంది. ఇందులో నేను ఆరాధన అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర లేకపోతే ఈ కథే లేదు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ నా పాత్ర గుర్తుండిపోతుంది" అని కామాక్షి ధీమా వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ .. విజయ్ సేతుపతి, శ్రీవిష్ణు, సుహాస్ వంటి హీరోలు అన్ని రకాల పాత్రలు చేస్తున్నారని, హీరోయిన్లు కూడా అలా ఎందుకు చేయకూడదని తాను సవాల్‌గా తీసుకుని విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నానని తెలిపింది. గత ఐదేళ్లలో ‘విరూపాక్ష’, ‘పొలిమేర’ వంటి చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని పేర్కొంది.
Latest News