|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:46 PM
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం మండలం తెల్లాపూర్ పరిధిలోని మేళ్ల చెరువులో మట్టి పోయకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. 108 ఎకరాల ఉన్న చెరువులో మట్టి పోయడంతో నీటి నిలువలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాని.. చెరువులోకి వరద నీరు రాకుండా ఇన్‌లెట్లకు ఎక్కడికక్కడ ఆటంకాలు ఏర్పాటు చేశారని హైడ్రా ప్రజావాణిలో ఆ పరిసర ప్రాంత నివాసితులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై మెదక్ ఎంపీ శ్రీ ఎం. రఘునందన్ రావు గారు కూడా హైడ్రా కమిషనర్‌కు లిఖితపూర్వక వినతి అందజేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశించారు. వేల లారీల మట్టితో పాటు.. బండరాళ్లు నింపినట్టు సంబంధిత శాఖలతో కలిసి నిర్వహించిన క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది. 108 ఎకరాల వరకూ ఉండాల్సిన చెరువు సగానికిపైగా మట్టితో నిండిపోయినట్టు హైడ్రా పరిశీలనలో వెల్లడైంది. చెరువు FTL పరిధిలో ఉన్న భూమిలో పంటలు పండించుకోవాలి తప్ప.. భూమి స్వరూపాన్ని మార్చ రాదన్న నిబంధనలు పట్టని విధంగా మట్టిని నింపడాన్ని హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. చెరువులోకి వరద నీరు రాకుండా ఎత్తు పెంచడంతో పాటు.. అడ్డుగోడలు నిర్మించడాన్ని తీవ్రమైన విషయంగా భావించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం అడ్డుగోడలను తొలగించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చిన దాదాపు 40 ఎకరాల మేర మట్టి పోయడానికి వీలు లేకుండా.. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది. మధ్యాహ్నం లోగా ఈ పనులను పూర్తి చేసింది. ఇదే సమయంలో అక్కడ వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా దారి చూపుతూ చర్యలు తీసుకుంది. కేవలం మట్టి పోయడానికి వీలు లేకుండా ఏర్పాట్లు చేసింది.మట్టి నింపిన వారిపై కేసులు పెట్టాలని హైడ్రా నిర్ణయించింది.