|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:26 PM
తీవ్ర నిరసనలు, ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ దేశ కరెన్సీ భారీగా పతనమవుతోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలతో ఇరాన్‌లో 6 వేల మందికి పైగా మరణించారు. అయితే మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికపరమైన ఆంక్షలతో ఇరాన్‌కు ఊపిరాడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో డాలర్ మారకంతో ఇరాన్ కరెన్సీ రియాల్స్ చరిత్రలో అత్యంత అల్పస్థాయికి పడిపోయింది.ఒక డాలర్ విలువతో పోలిస్తే 15 లక్షల రియాల్స్‌కు క్షీణించింది. అంతర్గత సంక్షోభానికి తోడు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతోంది. 2015లో అమెరికా డాలర్‌తో ఇరాన్ కరెన్సీ విలువ 32 వేల రియాల్స్‌గా ఉండేది. ఆ తర్వాత రియాల్స్ పతనమవుతున్నప్పటికీ, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మరింత క్షీణించింది.రియాల్ విలువ పడిపోతుండటంతో ఇరాన్ ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.