|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:50 PM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌మండలం కాచవాణి సింగారంలో రోడ్డు ఆక్రమణను మంగళవారం హైడ్రా తొలగించింది. 40 ఫీట్ల రహదారిలోకి 13 అడుగుల మేర జరిగి పక్కనే ఉన్న తన పొలం హద్దులుగా పేర్కొంటూ ఒక కిలోమీటరు మేర ప్రహరీ నిర్మించగా.. దివ్యానగర్ సింగరేనియన్స్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. నారాపల్లి – దివ్యనగర్ – కాచవాణి సింగారం గ్రామాలను కలుపుతూ సాగే ఈ రహదారిని ఆక్రమించారంటూ ఫిర్యాదు చేయగా.. హైడ్రా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించింది. దివ్యానగర్ ఫేజ్ 5 పేరిట నాలుగు లే ఔట్లు వేసినప్పుడు 40 ఫీట్ల వెడల్పుతో రహదారిని కేటాయించారు. తర్వాత ఆ పక్కనే వ్యవసాయభూమి ఉన్న మలిపెద్ది హనుమంత రెడ్డి తన భూమి ఉందని పేర్కొంటూ.. 13 అడుగుల మేరకు రోడ్డులోకి జరిగి ప్రహరీ నిర్మించారు. లే ఔట్‌లోని వెయ్యికి పైగా ఉన్న ప్లాట్ల యజమానులకు.. హనుమంత రెడ్డికి మధ్య దశాబ్ద కాలంగా ఈ సమస్య నలుగుతోంది. ఇదే విషయాన్ని సొసైటీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో పిర్యాదు చేశారు. లే ఔట్ ప్రకారం రహదారిని పరిశీలించి ప్రహరీని హైడ్రా తొలగించింది. దీంతో రహదారి పూర్తి వెడల్పుతో తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రజా రహదారుల పరిరక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.