|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:15 PM
జలమండలి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 4 అపార్ట్మెంట్ సీవరేజ్ కనెక్షన్ ను అధికారులు తొలగించారు. మరో 4 భవన యజమానులకు నోటీసులు అందించారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-15 పరిధి మాధాపూర్, కాకతీయ హిల్స్ లో కొంత మంది అపార్ట్మెంట్ యజమానులు.. అనుమతి లేకుండానే సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్ తీసుకున్నారు. దీంతో పాటు వాటినుంచి నుంచి వచ్చే అధిక సీవరేజ్ వల్ల మెయిన్ రోడ్ పై తరచూ సీవరేజ్ ఓవర్ ఫ్లో అయ్యేది. ఇటీవల స్థానిక అధికారులు పర్యటించిన సమయంలో ఈ విషయం బయటపడటంతో.. ఎండీ ఆదేశాల మేరకు ఈ రోజు 4 అపార్ట్మెంట్ సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్ ను తొలగించిన అధికారులు, మరో 4 భవన యజమానులకు నోటీసులు అందించారు. అక్రమంగా నల్లా, సీవరేజ్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్లు వాటిని క్రమబద్దీకరించుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి వినియోగదారుల్ని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, మాల్స్, తదితర వాణిజ్య, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు తప్పని సరిగా సిల్ట్ చాంబర్లు ఏర్పాటు చేసుకోవాలని పునరుద్ఘాటించారు.జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లు తీసుకుంటే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వగలరు.