|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:31 PM
ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మికుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు కార్మికులకు భరోసా కల్పించే అనేక కీలక పథకాలను ఆయన ప్రకటించారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల భారీ ప్రమాద బీమాను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని భట్టి తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు సైతం రూ. 40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ కారుణ్య నియామకాల కింద వారసుల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో వయసు మీరి ఉద్యోగావకాశాలు కోల్పోతున్న ఎందరో వారసులకు లబ్ధి చేకూరనుంది.దశాబ్దాలుగా కార్మికులను వేధిస్తున్న ‘మారుపేరు’ సమస్యను త్వరలోనే పరిష్కరించి, రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందేలా చూస్తామని భట్టి హామీ ఇచ్చారు. మెడికల్ ఇన్వాలిడేషన్ అడ్డంకులు తొలగించి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.