|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:43 PM
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తనకు పదవి రాకున్నా పర్వాలేదని, కానీ ప్రజల సమస్యలు తీరకపోతే ఏమైనా జరిగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. నల్లొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పనులు చేపట్టిన బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సగంలో నిలిపివేసి చేతులెత్తేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, వారం రోజుల్లో పూర్తిస్థాయి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం మూడు వారాలు గడిచినా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం సీఎం, మంత్రుల నియోజకవర్గాలలోనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బిల్లులు ఇవ్వకపోగా నూతన పనులను కూడా మంజూరు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.