|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 08:12 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడును పెంచింది. ఈ వివాదంపై పాత పంథాను వీడి, కొత్త పోరాట వ్యూహంతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేవలం విజ్ఞప్తులకే పరిమితం కాకుండా, ఈ నెల 30న ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలోనే తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టు అక్రమాలను ఎండగట్టేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
వచ్చే జవనరి 30వ తేదీన కేంద్రం నిర్వహించబోయే ఈ కీలక సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించే దిశగా సాగనుంది. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపకాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించడంతో పాటు, ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు లేవని నిరూపించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలను, నివేదికలను ఇప్పటికే అధికారులు క్రోడీకరించారు.
గతంలో ఈ ప్రాజెక్టులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోకపోతే తాము ఢిల్లీ భేటీని బహిష్కరిస్తామని తెలంగాణ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వ్యూహం మార్చి, సమావేశానికి హాజరై సాక్ష్యాలతో సహా ఏపీ వైఖరిని ఎండగట్టాలని డిసైడ్ అయ్యింది. అంతర్జాతీయ వేదికలు లేదా జాతీయ స్థాయి కమిటీల ముందు వాస్తవాలను ఉంచడం ద్వారా ఏపీ ప్రాజెక్టులను అక్రమమని నిరూపించాలని తెలంగాణ భావిస్తోంది. ఈ సమావేశం ద్వారానే తమ వాటా నీటిని దక్కించుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకోకపోతే భవిష్యత్తులో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని రాష్ట్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే కేంద్ర జలశక్తి శాఖ ముందు ఈ అంశాన్ని గట్టిగా వినిపించడమే కాకుండా, ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేయనుంది. ఈ ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం చూపించబోయే సాక్ష్యాలు ఏపీ ప్రాజెక్టుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. జల వివాదాల్లో తమ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.