|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:18 PM
నగరంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. అగ్ని ప్రమాదాలకు గల కారణాలపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించింది. జీహెచ్ ఎంసీ, అగ్నిమాపక శాఖలతో సమన్యంగా పని చేసి తనిఖీలను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు నడుం బిగించింది. శనివారం అగ్ని ప్రమాదానికి గురైన నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ దుకాణాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం సందర్శించారు. హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్లపాపయ్యగారితో పాటు డీఎఫ్‌వో యజ్ఞనారాయణ కమిషనర్ వెంట ఉన్నారు. ఫర్నీచర్ దుకాణ నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. సెల్లార్లు, కారిడార్లు ఖాళీ లేకుండా అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న ఫర్నీచర్‌ను భారీ స్తాయిలో నిలువ ఉంచడంతో ఈ ప్రమాదానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్‌కోసమే వినియోగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. సెల్లార్లలో అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న వస్తువులను నిలువ చేయరాదు. అలాగే నివాసాలు ఏర్పరచరాదు. వంటలుచేయడం తగదని హెచ్చరించారు. ఒక వేళ షార్టు సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినా దుకాణాల్లో ఉన్న వారు క్షణాల్లో బయట పడేందుకు వీలుగా దారులు చూపించాలని సూచించారు. మెట్ల దారులు, కారిడార్లలో నిలువలు ఉంచరాదన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పేందుకు ఉద్దేశించిన స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా.. అవి సరిగా పని చేస్తున్నాయోలేదో చూసుకోవాలని సూచించారు. ఇలా ఫైర్ నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని జీహెచ్ ఎంసీ, ఫైర్, హైడ్రా సంయుక్తంగా తనిఖీలు చేస్తాయని హెచ్చరించారు. నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.