|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:33 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్ అసహనం వ్యక్తం చేశాడు. ఓ ప్రయాణికురాలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.చౌటుకూరు గ్రామానికి చెందిన ఓ మహిళ సోమవారం రాత్రి జోగిపేట బస్టాండ్‌లో మెదక్ డిపోకు చెందిన పటాన్‌చెరు బస్సు ఎక్కారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ సీటు వద్ద నిల్చున్నారు. ఇది గమనించిన కండక్టర్, ఆమె చేయి పట్టుకుని పక్కకు తోసివేసి అసభ్య పదజాలంతో దూషించాడు. "సీఎంకు ఏం పని లేదు.. ఫ్రీ బస్సు పెట్టడంతో మహిళలు పనిపాట లేక బస్సుల్లో తిరుగుతున్నారు" అంటూ అందరి ముందూ అవమానకరంగా మాట్లాడాడు.కండక్టర్ ప్రవర్తనను సదరు మహిళ ప్రశ్నించడంతో అతను మరింత రెచ్చిపోయాడు. బస్సు ఆందోల్ వద్దకు రాగానే ఆమెను దిగిపోవాలని హుకుం జారీ చేశాడు. అయితే, బస్సులోని తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని బాధితురాలికి మద్దతుగా నిలిచారు. రాత్రిపూట మహిళను బస్సు నుంచి దించేయడం సరికాదని కండక్టర్‌ను హెచ్చరించారు. తనకు జరిగిన అవమానంపై తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు, మరుసటి రోజు మంగళవారం సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.