|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:02 PM
సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి....స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పటాన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల కాంప్లెక్స్‌కు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడతగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయములో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయించామని తెలిపారు . అందులో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లా కర్దనూర్‌లో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సుమారు మూడు ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. 20వేల ఎస్ఎఫ్టీలో నిర్మిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వంపై భారం పడకుండా ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రాజ్ పుష్ప ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో అధునాతన హంగులతో భవన నిర్మాణం పూర్తి చేయాలని సూచించినట్లు చెప్పారు. అలాగే కనీసం ఐదేళ్ల పాటు ఆయా భవనాల నిర్వహణ బాధ్యత కూడా నిర్మాణ సంస్థలదే ఉండేలా నిబంధనలు పొందుపరిచామని మంత్రి స్పష్టం చేశారు.ఈ సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలోకొత్తగా పెళ్లి రిజిస్ట్రేషన్‌కు వచ్చే జంటలకు ,చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు, దివ్యాంగులకు వయోవృద్ధులకు,పేద ప్రజలకుఅవసరమైన అన్ని అధునాతన హంగులతో ఫైవ్ స్టార్ వసతులతో, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా సామాన్య ప్రజలకు అందుబాటులో తేనున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేసి, పూర్తి హంగులతో భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.రాజ్ పుష్ప సంస్థ తమ స్వస్థలమైన కరీంనగర్ జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మించేందుకు ముందుకు రావడాన్ని అభినందించారు. రాజ్ పుష్పతో పాటు అపర్ణ వంటి ఇతర సంస్థలు కూడా ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.
భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే, భూమికి భూధార్ మ్యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భూభారతి కార్యక్రమం ద్వారా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒకే ప్లాట్‌ఫారంలో భూమి వివరాలు, సరిహద్దులు, నిషేధిత సర్వే నెంబర్ల వివరాలు లభించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.కొత్త యాప్ ద్వారా డబుల్, ట్రిపుల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లను జరుగకుండా ఉంటుందని స్పష్టం చేశారు. భూధార్ కార్డు పూర్తయ్యాక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీతో భూములు సర్వే చేపడుతున్నామని అందుకు 5500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను నియమించామని ,
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు నిర్వహించేందుకు ఆధునిక పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు. భూ సమస్యలు తగ్గితే జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి మరింతగా వస్తాయని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పటాన్‌చెరు పారిశ్రామిక హబ్‌గా మారిందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకురావాలంటే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల ప్రజలకు అనేక భూ సమస్యలు వచ్చాయని, దాని కారణంగా ప్రజలు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ కమిషనర్ రాజీవగాంధీ హనుమంతు మాట్లాడుతూ… రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.14,500 కోట్ల ఆదాయం సమకూరుతోందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, ఓఆర్ఆర్ పరిధిలోని మరియు వెలుపల ఉన్న కార్యాలయాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి సమీకృత భవనాలు నిర్మించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. పటాన్‌చెరు పరిధిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మంజూరుతో పాటు సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయ భవన నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రతిరోజూ రిజిస్ట్రేషన్లు, స్టాంపు కొనుగోలు తదితర సేవల కోసం అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వారి సౌకర్యార్థం ఒకే భవనంలో అన్ని సేవలు అందించే విధంగా ఈ సమీకృత కార్యాలయాలను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్పెర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్టార్లు , ఆర్డీఓ, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి,రాజ పుష్ప ఇంఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి ,రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.