|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:06 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ).. బుధవారం నుంచే (జనవరి 28) నుంచి నామినేషన్లు స్వీకరిస్తోంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది. ఈ మేరకు మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో జిల్లా, నియోజకవర్గాల స్థాయి నేతలను సభ్యులుగా చేర్చింది.
జనసేన మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ
జిల్లాల వారీగా కమిటీ సభ్యుల పేర్లు..
రంగారెడ్డి - శంకర్ గౌడ్
కరీంనగర్ - సాగర్ ఆర్కే నాయుడు
మెదక్ - రాధారాం రాజలింగం
మహబూబ్‌నగర్ - ముమ్మారెడ్డి ప్రేమకుమార్
వరంగల్ - మడి రెడ్డి దామోదర్ రెడ్డి
నల్గొండ - మేకల సతీష్ రెడ్డి
ఖమ్మం - మిరియాల రామకృష్ణ
నిజామాబాద్ - మాచ సుధాకర్
ఆదిలాబాద్ - మంథని సంపత్ కుమార్
నియోజకవర్గాల వారీగా కమిటీ సభ్యుల పేర్లు..
డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు - దాసరి రవిష్
పినపాక, యెల్లందు, భద్రాచలం - వేముల కార్తిక్
జనసేన తొలి నామినేషన్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లిలో జనసేన పార్టీ తొలి నామినేషన్ వేసింది. పెద్దపల్లి 9వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి సుమ - యాదవ్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. కాగా, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నాయకుడు, నటుడు సాగర్ ఆర్కే నాయుడు ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. అంతేకాకుండా పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత గుర్తింపు ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జనవరి 28 నుంచి జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సివస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌ఫర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక.. 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నిక చేయనున్నారు.