|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:11 PM
అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది. దాదాపు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించే ప్లాన్‌లో భాగంగా, ఇప్పటికే మొదటి విడతలో సగం మందిని విధుల నుంచి తొలగించింది. మిగతా వారిని కూడా తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ తగ్గింపు ప్రక్రియగా నివేదికలు చెబుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం, 2025 అక్టోబర్‌లో మొదటి దశలో సుమారు 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించగా, రెండో దశలో కూడా అదే స్థాయిలో కోతలు ఉండే అవకాశం ఉంది.ఈ కోతలు ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్ విభాగం, ప్రైమ్ వీడియో, ‘పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ’ (హెచ్‌ఆర్) విభాగాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. అమెజాన్ మొత్తం 15 లక్షల మంది ఉద్యోగుల్లో ఇది కేవలం 2 శాతం మాత్రమే అయినప్పటికీ, కార్పొరేట్ స్థాయిలో దాదాపు 10 శాతం ఉద్యోగాలు తగ్గుతాయి. అంటే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో పెద్ద మార్పు జరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.గతంలో ఉద్యోగ కోతలకు లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడం, ఏఐ వల్ల ఆటోమేషన్ వచ్చినట్లు కంపెనీలు చెప్పేవి. కానీ అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఈసారి కొత్త కారణం చెప్పారు. “కల్చర్”... అంటే సంస్థలో ఏర్పడిన బ్యూరోక్రసీ, లేయర్లు పెరగడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగడం. ఉద్యోగులు పెరిగేకొద్దీ టీమ్‌లు పెరిగాయి, మేనేజర్లు మరో మేనేజర్లను నియమించుకున్నారు. ఒక్క నిర్ణయానికి అనేక అనుమతులు, సమీక్షలు, చర్చలు అవసరమవుతున్నాయి. బాధ్యత ఎవరిది అనేది స్పష్టంగా లేకుండా పోయింది. దీంతో కంపెనీ నెమ్మదిగా ముందుకు సాగుతోందని జాస్సీ భావిస్తున్నారు. అందుకే ఈ తొలగింపులను ఆర్థిక సమస్యగా కాకుండా సంస్థ నిర్మాణాన్ని సరిచేసే చర్యగా చూపిస్తున్నారు.