|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:23 PM
గణతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజకీయ సంప్రదాయం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని ఆయన కోరారు.స్వాతంత్రానంతరం నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆనవాయతీని కొనసాగించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తే ప్రతిపక్ష నాయకుడిని మొదటి వరుసలో కూర్చోబెట్టేవారని, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన హక్కు అని ఆయన అన్నారు.ప్రస్తుత గణతంత్ర వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రవర్తనను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. మోదీ ప్రభుత్వం సంప్రదాయాలను పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ మూడో వరుసలో కూర్చున్నందుకు బాధపడరని, ఎందుకంటే ప్రధాని పదవి ఆయన ఇంట్లో పుట్టిందని అన్నారు. నరేంద్ర మోదీ ఇంట్లో ప్రధానమంత్రి పదవి పుట్టలేదని ఆయన ఎద్దేవా చేశారు.