|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:47 PM
వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం శాసనసభ స్పీకర్‌కు ఆయన ప్రివిలేజ్ మోషన్ (సభా హక్కుల ఉల్లంఘన నోటీసు) అందజేశారు.జాతరలో ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతలను దర్శించుకుంటున్న సమయంలో, కరీంనగర్ జిల్లా సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐ తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, చట్టాన్ని ఉల్లంఘించి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసు యంత్రాంగం ఒక శాసనసభ్యుడి హక్కులను కాలరాసిందని, ఈ చర్య శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బాధ్యులైన అధికారులపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు.