|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 09:21 PM
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా ముందుకు వచ్చి తన వాదనను వినిపించారు. స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు తన లీగల్ టీమ్ ఇప్పటికే అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చిందని.. తనపై వస్తున్న అనర్హత ఆరోపణలను కొట్టివేయాలని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే తనను వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఒకవేళ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని దానం స్పష్టం చేశారు.
స్పీకర్‌కు సమర్పించిన వివరణలో దానం నాగేందర్ తనపై ఉన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ రాజీనామా చేయలేదని, ఇప్పటికీ సాంకేతికంగా ఆ పార్టీ సభ్యుడినేనని తెలిపారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే.. అది కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమేనని, దానిని పార్టీ మార్పిడిగా పరిగణించలేమని ఆయన సమర్థించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదని గుర్తు చేస్తూ.. కేవలం మీడియా కథనాల ఆధారంగా తనపై అనర్హత వేటు వేయాలని కోరడం సరికాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను ఉప ఎన్నికలకు భయపడబోనని.. ఏ నిర్ణయానికైనా సిద్ధమేనని కీలక కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ.. త్వరగా నిర్ణయం తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై పిటిషన్లను కొట్టేశారు. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన రికార్డులు ఉండటంతో.. ఆయన విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పునిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 30న ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్ పిటిషన్‌పై తుది విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణకు హాజరుకావాలని దానంతో పాటు ఫిర్యాదుదారులు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు కూడా నోటీసులు అందాయి. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో పిటిషన్లు వీగిపోయినప్పటికీ.. దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం ఇంకా పెండింగ్‌లో ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సమీపిస్తున్న తరుణంలో.. ఈ నెల 30న వెలువడబోయే స్పీకర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.