|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:02 PM
మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సారలమ్మ నిన్న రాత్రి అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. అమ్మ ఆగమనంతో మేడారం పరిసరాలు దివ్యానుభూతితో నిండిపోయాయి. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం నుంచి బుధవారం రాత్రి 7.38 గంటలకు అమ్మ ఊరేగింపు ప్రారంభమైంది. సంప్రదాయ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ జంపన్నవాగు వద్దకు రాత్రి 8.48 గంటలకు చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అశేష భక్తజనం నడుమ అమ్మను మేడారంకు తీసుకువచ్చారు. తొలుత సారలమ్మ ఆలయాన్ని పూజారుల కుటుంబ సభ్యులు శుద్ధి చేసి, లోపల మరియు బయట ముగ్గులు వేసి, మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. అనంతరం రహస్య పూజలు నిర్వహించగా, ఆలయం వెలుపల ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మను కీర్తించారు. సారలమ్మ రూపమైన కుంకుమ భరిణను ప్రధాన పూజారి కాక సారయ్య తలపై ఎత్తుకొని ఆలయం వెలుపల అడుగు పెట్టగానే భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. సంతానం కోసం, కష్టాల నివృత్తి కోసం వేలాది మంది భక్తులు అమ్మను వేడుకున్నారు. మహిళలు తడిబట్టలతో సాగిలపడి హారతులు ఇచ్చారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర భక్తులు ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు. అడుగడుగునా నీరాజనాలు, పసుపు - కుంకుమలు, అక్షింతలతో అమ్మకు స్వాగతం పలికారు. భక్తులు అమ్మ రూపాన్ని తాకేందుకు ఉత్సాహం చూపించగా, రోప్ పార్టీలు పూజారులకు రక్షణ వలయంగా నిలిచాయి. జంపన్నవాగు వద్ద జంపన్న పక్షాన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వాగు అవతల ఒడ్డున ఉన్న నాగులమ్మకు కూడా పూజలు చేశారు. అక్కడి నుంచి సారలమ్మను మేడారంలోని సమ్మక్క ఆలయానికి తీసుకువచ్చారు. పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలిసి సారలమ్మకు పూజలు నిర్వహించగా, సమ్మక్క - పగిడిద్దరాజు కల్యాణ తంతు ఘనంగా జరిగింది.