|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:11 PM
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని సీత్యాతండాలో బుధవారం వెలుగు చూసిన ఒక హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మేనల్లుడితో ఉన్న వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని, ఏకంగా భర్తనే కిరాతకంగా చంపేసిందో భార్య.సీత్యాతండాకు చెందిన రమావత్ రవి(34)కి, లక్ష్మికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. రవి పీఏసీఎస్‌లో అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రవి అక్క కుమారుడైన గణేశ్‌తో లక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో దంపతుల మధ్య ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి లక్ష్మిని అత్తారింటికి తీసుకొచ్చినా ఆమెలో మార్పు రాలేదు. పైగా తనకు అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.ఈ నెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, హైదరాబాద్‌లో పనిచేస్తున్న మేనల్లుడు గణేశ్‌ను లక్ష్మి ఇంటికి పిలిపించింది. ఆ రాత్రి రవి మద్యం మత్తులో ఉండగా, లక్ష్మి-గణేశ్ కలిసి అతడిపై దాడి చేసి హతమార్చారు. మరుసటి రోజు ఉదయం తలుపులు తీసి చూసిన రవి తల్లిదండ్రులకు కుమారుడు విగతజీవిగా కనిపించగా, కోడలు లక్ష్మి మాత్రం కనిపించలేదు. తనతో పాటు మానసిక దివ్యాంగుడైన చిన్న కుమారుడిని తీసుకుని ఆమె ప్రియుడితో పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.