|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:56 AM
ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుంచే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.గతంలో ఉన్న mAadhaar యాప్ కంటే ఈ కొత్త యాప్ ఎన్నో ఆధునిక ఫీచర్లను అందిస్తోంది. వాస్తవానికి ఈ యాప్‌ను 2025 నవంబర్‌లో పరిచయం చేసినా, ఇప్పటివరకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా పూర్తిస్థాయి వెర్షన్‌ను విడుదల చేయడంతో మొబైల్ నంబర్, ఇంటి చిరునామా వంటి వివరాలను ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు. యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లో ఒకేసారి తమ కుటుంబ సభ్యులకు చెందిన 5 ఆధార్ కార్డులను యాడ్ చేసుకుని, వాటిని కూడా నిర్వహించుకునే వీలుంది.ఈ కొత్త యాప్‌లో భద్రతకు పెద్దపీట వేశారు. ‘సెలెక్టివ్ షేర్’ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ మొత్తం చెప్పకుండానే ఆఫ్‌లైన్‌లో గుర్తింపును ధ్రువీకరించుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఫొటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో వేటిని షేర్ చేయాలో ఎంచుకోవచ్చు. దీనివల్ల గోప్యతకు భంగం కలగకుండా గుర్తింపును ధ్రువీకరించుకోవడం సాధ్యమవుతుంది. దీంతో పాటు బయోమెట్రిక్ లాకింగ్ (వేలిముద్ర, ముఖం, కనుపాప లాక్) ఫీచర్‌తో అదనపు భద్రతను పొందవచ్చు.ఒకవేళ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, యాప్ నుంచి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది.