|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:43 AM
ఫైర్ సేఫ్టీపై హైడ్రా దృష్టి పెట్టింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వ్యాపార సముదాయాల నుంచి నివాస ప్రాంతాల వరకూ ఫైర్ సేఫ్టీలో ఎక్కడా అలసత్వాన్ని ఉపేక్షంచరాదని హైడ్రా నిర్ణయించింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకునేందుకు నడుం బిగించింది. జీహెచ్ ఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల అధికారులతో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు బుధవారం సమావేశమయ్యారు. ఫైర్ సేఫ్టీ కార్యాచరణ వివరించారు. వ్యాపార సముదాయాలు, ఫర్నీచర్, వస్త్ర దుకాణాలు ఇలా అన్ని చోట్లా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ పాటించకపోతే.. ఆయా షాపులను సీజ్ చేయాలని నిర్ణయించారు. వెనువెంటనే విద్యుత్ సరఫరా బంద్ చేయాలని.., ఫైర్ సేఫ్టీ లేని వ్యాపార సముదాయంగా.., షాపుగా పేర్కొంటూ నోటీసులు అతికి పెట్టాలని అధికారులకు సూచించారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 9000113667 కు ఫోను చేసి సమాచారమివ్వాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్న పరిస్థితులున్నాయో కరెంటు లొకేషన్‌తో పాటు.. వీడియోలు, ఫొటోలు పంపించాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలు తగ్గించడమే కావాలని కోరారు. గతేడాది నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాలు 36కు పైగా ఉన్నాయని.. నెలకు 3 చొప్పున ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
-జాగ్రత్తలు తప్పనిసరి ..
నాంపల్లిలో జరిగిన ఫర్నీచర్ దుకాణం సెల్లార్‌లలో లెక్కకు మించిన ఫర్నీచర్‌ను నెట్టులుగా పెట్టారు. సెల్లార్లోనే వాచ్‌మ్యాన్‌కు నివాసం కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు షాపులో ఉన్న వారు బయటపడినా.. సెల్లార్‌లో ఉన్న వారు మంటల్లో చిక్కుకున్నారు. ఇందులో కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు.
వస్త్ర దుకాణదారులు, ఫర్నీచర్ షాపులతో పాటు ఇతర వ్యాపారాలు చేసిన వారు.. వారి నిలువలను మెట్ల మార్గంలో, కారిడార్‌లో, సెల్లార్లలో నిలువ ఉంచరాదు. ఇందుకు ప్రత్యేకంగా జన సంచారం లేని ప్రాంతాల్లో గోదాముల్లో నిలువ ఉంచుకోవాలి.
సెల్లార్ లు వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న వస్తువులు, పదార్థాలు నిల్వ ఉంచరాదు.
వ్యాపార సముదాయాల్లో నివాసాలు ఏర్పాటు చేయరాదు. అలాగే సెల్లార్లలో వర్కర్లు, వాచ్ మ్యాన్ కుటుంబాలకు గదులు కేటాయించడం చేయరాదు.
సెల్లార్ నుంచి టెర్రాస్ వరకూ మెట్ల మార్గాలను ఎట్టి పరిస్థితులలో బ్లాక్, లాక్ చేయరాదు.
షాపులు, వ్యాపార సముదాయాల్లో ఉన్న అగ్ని నియంత్రణ పరికరాలు ఎల్లవేళలా పని చేసే విధంగా ఉంచుతూ, సిబ్బందికి అగ్ని పరికరాలపై తగిన అవగాహన కల్పించాలి.
ఒక వేళ షార్టు సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినా దుకాణాల్లో ఉన్న వారు క్షణాల్లో బయట పడేందుకు వీలుగా దారులు చూపించాలి.
అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పేందుకు ఉద్దేశించిన స్ప్రింక్లర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.