|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:21 PM
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే పతాక స్థాయికి చేరుకుంది. నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ మొదలుకాకముందే, మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఆశావహులు ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు. గెలుపు గుర్రాల కంటే కూడా, పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచే వారికే అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందనే ప్రచారంతో క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.
ముఖ్యంగా అధికార, ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యేలు మరియు సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం టిక్కెట్ ఇస్తే సరిపోదని, తమను మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులుగా ప్రకటిస్తే ఎన్నికల ఖర్చు మొత్తం తమదేనని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ఖర్చుతో పాటు, పార్టీ ఫండ్‌ను కూడా తామే చూసుకుంటామని హామీ ఇస్తూ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలో ఛైర్మన్ పదవి కోసం కోట్లాది రూపాయల బేరసారాలు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక్కో మున్సిపాలిటీలో ఛైర్మన్ గిరి కోసం దాదాపు రూ. 3 కోట్ల వరకు వెచ్చించేందుకు ఆశావహులు సిద్ధపడుతున్నట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే కీలక నేతలతో అంతర్గత ఒప్పందాలు కూడా కుదిరాయని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే దానిపై తెరవెనుక హామీలు పూర్తయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే ధనప్రభావం ఈ స్థాయిలో ఉండటం పట్ల సామాన్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబద్ధతతో పనిచేసే వారి కంటే, డబ్బు సంచి ఉన్నవారికే పదవులు దక్కుతాయనే సంకేతాలు వెళ్లడం పార్టీల అంతర్గత సమతూకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, ఫిబ్రవరి 11న జరిగే ఈ పోరులో ప్రజాబలం గెలుస్తుందా లేక ధనబలం పైచేయి సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.