|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:57 PM
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వే నివేదికలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి విస్తీర్ణం ఊహించని రీతిలో పెరగడం విశేషం. సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా.. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే.. 2014 నుంచి 2023 మధ్య వరకు రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి విస్తీర్ణం కేవలం 1.31 కోట్ల ఎకరాలుగా ఉండేది. ప్రస్తుతం ఏకంగా 2.21 కోట్ల ఎకరాలకు చేరుకుందని సర్వేలో పేర్కొన్నారు. అంటే దాదాపు ఒక కోటి ఎకరాల అదనపు భూమి కొత్తగా సాగులోకి వచ్చింది. ఇది దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని విధంగా నమోదైన అతిపెద్ద వృద్ధిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాగు విస్తీర్ణం ఇంతలా పెరగడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బహుళార్ధసాధక ప్రాజెక్టులు, జలవనరుల నిర్వహణ ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే పేర్కొంది.
అందులో ఒకటి మిషన్ కాకతీయ.. గ్రామాల్లోని చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. దీనివల్ల బావులు, బోర్ల కింద సాగు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు .. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం ద్వారా గతంలో ఎడారిగా ఉన్న ప్రాంతాలకు కూడా సాగునీరు అందింది. వీటితో పాటు.. చెక్ డ్యామ్‌ల నిర్మాణం , కాలువల ఆధునీకరణ ద్వారా చిట్టచివరి భూములకు కూడా నీరు చేరుతోంది. వీటి ఫలితమే.. సాగు భూమి విస్తీర్ణం అధికంగా పెరిగింది. ఇటీవల ప్రవేశపెట్టిన భూ భారతి ద్వారా.. భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ , రిజిస్ట్రేషన్ విభాగాల ఏకీకరణ వల్ల భూ యజమానులకు స్పష్టత వచ్చింది. ఇది రైతులు తమ భూములను మరింత సమర్థవంతంగా సాగు చేసుకునేలా ప్రోత్సహించింది.
వ్యవసాయంతో పాటు తయారీ రంగంలో తెలంగాణ 5 శాతం వాటాను నమోదు చేసింది. ఇక ఐటీ, ఫైనాన్స్ సర్వీసులలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులతో కలిసి తెలంగాణ దేశంలో 40 శాతం వాటాను కలిగి ఉంది. ఏఐ స్టార్టప్‌లలో తెలంగాణ 7 శాతం వాటాతో దూసుకుపోతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 201.1 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మున్సిపల్ బాండ్ల జారీలో కూడా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. సాగు విస్తీర్ణం పెరుగుదల కేవలం ఆహార భద్రతనే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోందని నివేదిక పేర్కొంది.