|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:37 PM
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్‌లో నిర్వహించిన వార్షిక క్రీడా దినోత్సవం (Annual Sports Day) వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా జీవితం నేర్పే గొప్ప పాఠశాలలాంటివని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, సహనం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న శరీరంలోనే బలమైన ఆలోచనలు పుడతాయని, అందుకే చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.గెలుపు ఒక్కరోజు ఆనందాన్ని ఇస్తే, ఓటమి జీవితాంతం ఉపయోగపడే అనుభవాన్ని నేర్పుతుందని ఆయన అన్నారు. ప్రతి పోటీ విద్యార్థులను మరింత బలంగా, ధైర్యంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనడం ద్వారానే నిజమైన విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ రోజు మైదానంలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి, విద్యార్థినీ ఇప్పటికే విజేతలేనని ప్రశంసించారు.విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి సాధన చేస్తే అసాధ్యం అనే మాటే ఉండదని అన్నారు. క్రీడలు నాయకత్వ గుణాలు, టీమ్ వర్క్, పరస్పర గౌరవాన్ని అలవర్చడంతో పాటు, భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. చదువులోనూ, ఆటలోనూ సమతుల్యత సాధించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని తెలిపారు.విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలకమని, ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయిలకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటగలరని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో MEO నాగేశ్వర రావు గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోసెఫ్ బాబు గారు, సెల్వన్ ఫాదర్ గారు, MDR ఫౌండేషన్ అధ్యక్షులు మధు గారు, ప్రవీణ్ గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.