|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 08:00 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసింది. మరోవైపు, సిట్ నోటీసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూకేసీఆర్ కీర్తిని దిగజార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ధీరుడు కేసీఆర్ అని ఆయనకు కేసులు, కొట్లాటలు, కోర్టులు కొత్తకాదని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిన చరిత్ర కేసీఆర్ కు ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతల సిట్ లు, బొట్ లకు కేసీఆర్ భయపడరని అన్నారు. ఇలాంటి వాటికి బీఆర్ఎస్ బెదరదని చెప్పారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. మరోవైపు, రేపు మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఏదైనా ఒక ప్లేస్ చెబితేతామే అక్కడకు వచ్చి విచారణ జరుపుతామని తెలిపారు.