|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:30 PM
తెలంగాణలోని మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన దీనిని 'తెలంగాణ కుంభమేళా' అని కూడా పిలుస్తారు. దాదాపు కోటిన్నర మంది భక్తులు ఈ జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.
సమ్మక్క పుట్టుక - కోయ పురాణం:13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో మేడారం ప్రాంతాన్ని పాలించే కోయ దొరకు సంతానం లేకపోవడంతో అమ్మవారిని వేడుకోగా, వారికి అడవిలో ఒక పాప దొరికింది. ఆ పాప ఒక పుట్టపై లేదా పెట్టెలో దొరికిందని చెబుతారు. ఆమె చుట్టూ సింహాలు, పులులు కాపలా కాస్తుండడం చూసి ఆమె దైవ స్వరూపమని గుర్తించి 'సమ్మక్క' అని పేరు పెట్టారు. సమ్మక్క పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఎన్నో మహిమలు చూపేది, రోగాలను నయం చేసేది. ఆమెను ప్రజలందరూ తమ తల్లిగా భావించేవారు. సమ్మక్కను పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేయగా, వారికి సారలమ్మ (సారక్క), నాగులమ్మ మరియు జంపన్న అనే సంతానం కలిగారు.
చారిత్రక నేపథ్యం మరియు యుద్ధం : కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో మేడారం పాలకులు కాకతీయులకు సామంతులుగా ఉండేవారు. తీవ్రమైన కరువు కాటకాల వల్ల మేడారం ప్రజలు కాకతీయులకు కప్పం (పన్ను) కట్టలేకపోయారు. దీంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తాడు. అన్యాయంగా పన్ను అడగడం రాజ ధర్మం కాదని సమ్మక్క కుటుంబం కాకతీయ సైన్యాన్ని ఎదురించింది. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, సారక్క, గోవిందరాజులు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు.చిన్నవాడైన జంపన్న కాకతీయ సైన్యంపై ఎదురుదాడి చేసి, చివరకు సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అతని రక్తం వల్ల ఆ వాగు ఎర్రగా మారిందని, అందుకే దానిని 'జంపన్న వాగు' అంటారని నమ్మకం.
సమ్మక్క అంతర్థానం :కుటుంబ సభ్యులందరూ మరణించాక సమ్మక్క యుద్ధరంగంలోకి దూకి శత్రువులను సంహరించింది. అయితే వెన్నుపోటు పొడవడంతో గాయపడిన ఆమె చిలుకల గుట్ట వైపు వెళ్లి అంతర్థానమైంది. ప్రజలు వెతుక్కుంటూ వెళ్లగా అక్కడ ఒక కుంకుమ భరిణ మాత్రమే కనిపించింది. తమను రక్షించడానికి అమ్మవారే మనిషి రూపంలో వచ్చి ప్రకృతిలో కలిసిపోయిందని గిరిజనులు నమ్ముతారు.
నాలుగు రోజుల జాతర క్రమం : మొదటి రోజు: కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. అలాగే కొండాయి నుండి గోవిందరాజును, పూనుగొండ్ల నుండి పగిడిద్ద రాజును మేడారం గద్దెలపైకి చేరుస్తారు. రెండవ రోజు: చిలుకల గుట్ట నుండి సమ్మక్క అమ్మవారిని కుంకుమ భరిణ రూపంలో పూజారులు గద్దెకు తీసుకువస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారికి ఘనస్వాగతం పలుకుతారు.మూడవ రోజు: అమ్మవార్లందరూ గద్దెలపై కొలువుదీరి ఉంటారు. ఈ రోజు భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లాన్ని (బంగారం) సమర్పించుకుంటారు. కోళ్లు, మేకల మొక్కులు కూడా తీర్చుకుంటారు. నాల్గవ రోజు: అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుందిఈ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అన్యాయాన్ని ఎదిరించి ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనితల స్మృతిలో జరిగే ఒక గొప్ప సంప్రదాయం.