|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 07:24 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం తెలంగాణలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను వారి వద్దే ఉంచుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ నుంచి డబ్బుల అందలేదన్న కారణంతో ఇలా చేస్తున్నాయి. ఇటువంటి కాలేజీల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రేవంత్ సర్కార్‌కు ఆదేశాలు కూడా జారీ చేసింది.
విద్యార్థులకు రావాల్సిన ఫీజులు ఇంకా రాలేదన్న కారణంతో వారిని వేధించడం సరికాదని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. బకాయిల కారణంగా వారి సర్టిఫికేట్లను ఆపి ఉంచే హక్కు ఏ విద్యా సంస్థకు లేదని పేర్కొంది. ఇది విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడమే అని తెలిపింది. సర్టిఫికేట్లు చేతికి వస్తేనే.. తర్వాత ఉద్యోగం చేయాలన్నా.. ఉన్నత చదువులకు వెళ్లాలన్న వీలవుతుంది. లేకపోతే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఇలా చేస్తే వారి భవిష్యత్ దెబ్బతింటుందని.. దానికి కాలేజీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
అయితే ప్రభుత్వం నుంచి కాలేజీలకు ఎంత మెత్తం రావాలి..? ఆ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు..? అనే అంశాలపై రెండు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే కాకుండా.. కాలేజీల వేధింపులకు గురవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే.. ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. అంతే కాకుండా.. విద్యార్థుల సమస్యలను చెప్పుకోవడానికి.. దానికి తక్షణమే పరిష్కారం పొందేందుకు ఒక అధికారిని కూడా నియమించాలని పేర్కొంది.
విద్యార్థి సంఘాల ఆందోళన..
గత కొన్ని రోజుల నుంచి విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే వేల కోట్ల రూపాయిలు బకాయిలు ఉండటంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ప్రైవేట్ యాజమాన్యాలు సాకుగా చూపుతున్నాయి.
ప్రభుత్వానికి, ఈ విద్యాసంస్థలకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారనేది నిపుణులు చెబుతున్న మాట. ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తున్న ఈ పని కారణంగా విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇలా చేయడం నేరమని చట్టం చెబుతోంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణలోని వేలాది మంది పేద విద్యార్థులకు ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి.