|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 07:16 PM
మృత్యువు కళ్లముందు తాండవిస్తుంటే.. నిమిషాల్లో ప్రాణం పోతుందని తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చుట్టూ ముసురుకున్న అగ్నికీలలు... ఊపిరి సలపనివ్వని దట్టమైన పొగ.. ఆ భీకర వాతావరణంలో తన కోసం కాకపోయినా.. తనతో ఉన్న పసిపిల్లల ప్రాణాలు కాపాడాలంటూ ఒక వ్యక్తి చేసిన ఆఖరి ప్రయత్నం వింటే రాతి గుండె అయినా కరిగి నీరవ్వాల్సిందే. నాంపల్లి అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన ఇంతియాజ్ చివరి నిమిషంలో చేసిన ఆడియో సంభాషణ ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తోంది.
జనవరి 24వ తేదీన మధ్యాహ్నం నాంపల్లి ప్రధాన రహదారికి పక్కనే ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం మొదట సెల్లార్‌లో ప్రారంభం అయింది. అక్కడ నుంచి మెల్లగా 4 అంతస్థులకు పాకింది. ఆ భయానక సమయంలో ఆ భవనం కాపలాదారుడి పిల్లలు సెల్లార్‌లోనే ఉండిపోయారు. అయితే ఆ చిన్నారులను కాపాడాలనే మానవత్వంతో కర్ణాటకకు చెందిన ఉస్మాన్ ఖాన్, ఆయన భార్య బేబి... అలాగే అక్కడ పనిచేసే ఇంతియాజ్ లోపలికి వెళ్లారు. కానీ విధి వెక్కిరించింది. క్షణాల్లోనే పొగ మొత్తం వ్యాపించడంతో బయటకు వచ్చే దారి వారికి కనిపించలేదు. దీంతో వారంతా అక్కడే దిక్కుతోచని పరిస్థితిల్లో ఉండిపోయారు.
సెల్లార్‌లోని వెనుకు ఉన్న మరో ద్వారం మూసుకుపోవడంతో.. ఇంతయాజ్ తమ బంధువులకు ఫోన్ చేశాడు. ‘మమ్మల్ని కాపాడండి.. ఇక్కడ ఊపిరి ఆడటం లేదు.. వెనుక డోర్ తీయండి.. చనిపోయేలా ఉన్నాం’ అంటూ అతడు చేసిన ఆర్తనాదాలు ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ ఆడియోలో పిల్లల ఏడుపులు కూడా వినపడుతున్నాయి. ఆ ఆడియో వినిపిస్తుంటే వినేవారి గుండెలు బరువెక్కుతున్నాయి. ఆ ఫోన్ కాల్ మాట్లాడుతుండగానే అగ్ని కీలలు వారిని చుట్టుముట్టాయి. ఆ దెబ్బకు ఫోన్ కూడా అక్కడే కాలిపోయింది. చిన్నారులను కాపాడబోయి ఇంతియాజ్, ఆ దంపతులు కూడా సజీవ దహనమయ్యారు.