|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 12:02 PM
మేడారం జాతరలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. గద్దెల దగ్గరి నుంచి పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లి కారులో కరీంనగర్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే వీణవంక మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తన భార్య, పిల్లలను నడిరోడ్డు పై గంటల తరబడి నిలబెట్టడం పై కౌశిక్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మహిళలను గౌరవించలేని ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందని హెచ్చరించారు. హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి భయపడే ప్రభుత్వం ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా , ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజల పక్షాన తన గళం వినిపిస్తూనే ఉంటానని, ప్రభుత్వ దమనకాండకు తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. శాంతియుతంగా జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకోవడం పై స్థానికంగా, సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. పోలీసుల తీరు పై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.