|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:50 PM
నిజాం నవాబులకు చెందిన అపురూప ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నగలు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధీనంలో అత్యంత భద్రంగా ఉన్నాయని, అయితే వాటిని శాశ్వత ప్రదర్శన కోసం హైదరాబాద్‌కు తరలించే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 1995 నుంచి 173 అపురూపమైన నిజాం ఆభరణాలు ఆర్‌బీఐ లాకర్లలో ఉన్నాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? అని అడగగా, మంత్రి 'అవును' అని బదులిచ్చారు.ఈ నగల చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందా అని, వాటిని సొంత గడ్డ అయిన హైదరాబాద్‌లో ప్రదర్శించాలన్న ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటుందా అని కూడా ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ, నిజాం నగల చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను, వాటితో ముడిపడి ఉన్న ప్రజా ప్రయోజనాలను తమ మంత్రిత్వ శాఖ గుర్తిస్తుందని తెలిపారు.అయితే, ఆర్‌బీఐతో ఉన్న ఒప్పందం ప్రకారం భద్రతా కారణాల రీత్యా ఈ ఆభరణాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాయని షెకావత్ వివరించారు. ఈ నేపథ్యంలో వాటిని శాశ్వత ప్రదర్శన కోసం హైదరాబాద్‌కు తరలించే అంశంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.