|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:00 AM
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నానక్ రాం గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో సీవరేజ్ సిస్టమ్ ను మెరుగుపరచడానికి, ట్రంక్ మెయిన్లను అభివృద్ధి చేయడానికి మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గచ్చిబౌలి, నానక్ రాం గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఎండీ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా.. అధికారులతో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఉత్పన్నం అవుతున్న మురుగు, ఇప్పటివరకు ఉన్న సీవరేజ్ లైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను బట్టి సీవరేజ్ లైన్లను, ట్రంక్ మెయిన్ల అభివృద్ధికి మినీ సీవరేజ్ ప్లాన్ లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న నాలాలు, వాననీటి కాలువలు, ట్రంక్ మెయిన్ల వివరాలను సేకరించి అధ్యయనం చేయాలని సూచించారు.
అలాగే, మూసీ , ఇతర సమీప చెరువుల్లో మురుగు చేరి కలుషితం కాకుండా వర్షపు నీటి కాలువలనుంచి మురుగునీటి పైపు లైన్లను వేరుచేసి 2047 మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీవరేజ్ ట్రంక్ మెయిన్ల, సబ్ సీవరేజ్ లైన్ల నిర్మాణంకోసం ప్రతిపాదనను సమర్పించాలని అన్నారు. దీనికై ఓ అండ్ ఎం, ఎస్టీపీ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. దీంతోపాటు నానక్ రాం గూడ ఎస్టీపీ క్యాచ్ మెంట్ ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే మురుగును అంచనావేసి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్టీపీ విభాగ అధికారులకు సూచించారు.గచ్చిబౌలి నుంచి కోకపేట్ పరిసర ప్రాంతాల్లో ఉత్పన్నం అవుతున్న మురుగును కోకాపేట ఎస్టీపీకి తరలించి.. శుద్ధి చేయడానికి సీవర్ ట్రంక్ మెయిన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలి అధికారులను కోరారు. అలాగే కోకపేట్ దిగువనున్న ప్రాంతాలోని మురుగును సమీపంలోని చిత్రపురి, ఇబ్రహీం చెరువు ఎస్టీపీకి మళ్ళించడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
అంతకుముందు నానక్ రాం గూడలోని 4.5 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీని సందర్శించారు. మురుగుశుద్ధి ప్రక్రియను పరిశీలించిన ఎండీ..ఎస్టీపీ సామర్థ్యం, శుద్ధి నీటి నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీప ప్రాంతాల్లోని ఉత్పన్నమయ్యే మురుగును ఈ ఎస్టీపీలో శుద్ధి చేసే సామర్థ్యం ఉందా..? లేకుంటే సామర్థ్యం పెంచడానికి, కొత్త ఎస్టీపీ నిర్మించడానికి సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్టీపీ కార్యాలయం సందర్శించిన ఎండీ అన్నీ ఎస్టీపీల మురుగుశుద్ధి వివరాలను, గణాంకాలను ఎప్పటికప్పుడు నమోదుచేయడానికి ప్రత్యేకమైన యాప్ ను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీనివల్ల ఎక్కడినుంచి అయినా వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు.
నానక్ రాంగూడ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని గోల్ఫ్ కోర్టులో వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు ఓఆర్ఆర్ వెంట శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి పైప్ లైన్ నిర్మించడానికి డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పైప్ లైన్ తో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న గార్డెనింగ్ కి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, జీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు.