|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:33 PM
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. అయితే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌తో నరకయాతన అనుభవిస్తున్నారు.దర్శనం ముగించుకుని తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో మేడారం మార్గాలు నిండిపోయాయి. తాడ్వాయి – మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలు భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గోవిందరావుపేట మండలం పస్రా వద్ద కూడా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రైవేట్ వాహనాలను పస్రా మీదుగా, ఆర్టీసీ, వీఐపీ వాహనాలను తాడ్వాయి మీదుగా మళ్లించారు.