|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:36 PM
చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగాల్లో కీలకమైన 'ఆర్టెమిస్-2' యాత్ర వాయిదా పడింది. ఫ్లోరిడాలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రయోగాన్ని ఫిబ్రవరి 8వ తేదీకి మార్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది. తొలుత ఈ ప్రయోగాన్ని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫిబ్రవరి 6న చేపట్టాలని నిర్ణయించారు.ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్రమైన చలిగాలులు, గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో నాసా ఈ నిర్ణయం తీసుకుంది. "వాతావరణ పరిస్థితుల కారణంగా ఆర్టెమిస్-2 రాకెట్‌లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం నాడు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ మార్పుతో ప్రయోగానికి సాధ్యమయ్యే తొలి తేదీ ఫిబ్రవరి 8 అవుతుంది. ఇంధనం నింపే ప్రక్రియను సమీక్షించాక తుది ప్రయోగ తేదీని ఖరారు చేస్తాం" అని నాసా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపింది.