|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:33 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అగ్రనేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లను విచారించింది. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సిట్ విచారించే విషయమై గత రెండు రోజులుగా సందిగ్ధం నెలకొంది. తాజాగా దీనిపై కేసీఆర్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుపై కేసీఆర్ స్పందించారు. చట్ట ప్రకారం నోటీసు ఇవ్వలేదని పేర్కొన్నారు. నోటీసు ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని లేఖలో ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం (ఫిబ్రవరి 1) మధ్యాహ్నం 3 గంటలకు తనను హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారించాలని సిట్ నోటీసులు జారీ చేసిన విషయంపై తాజాగా కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఏసీపీకి రాసిన లేఖలో.. "నందినగర్‌లోని నా నివాసానికి సిట్ అధికారులు వచ్చి నోటీసులు అంటించడం చెల్లదు. భారత రాజ్యాంగం ప్రకారం నోటీసులు అంటించడం అక్రమం. 160 పీఆర్‌సీ ప్రకారం.. నాకు నోటీసులు ఇచ్చే పరిధి ఏసీపీకి లేదు. నేను ఉండే ఎర్రవల్లిలో నా వాంగ్మూలం రికార్డు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సిట్ విచారణకు నేను సహకరిస్తాను. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాను" లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ లేఖ రాసి తమ చట్టబద్ధతను ప్రశ్నించడంతో.. సిట్ అధికారులు మరోసారి సమావేశమమైనట్లు తెలుస్తోంది.
కాగా, అంతకుముందు తనను ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో విచారించాలని కేసీఆర్ సిట్‌కు లేఖ రాశారు. అయితే ఈ అభ్యర్థనను సిట్ అధికారులు రిజెక్ట్ చేశారు. కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాలను పరిగణనలోకి తీసుకుని.. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలోనే విచారణ చేపట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు, న్యాయ నిపుణులతో కేసీఆర్ సూదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఆ తర్వాత సిట్ విచారణకు కేసీఆర్ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆదివారం సిట్ అధికారులు కేసీఆర్ వాంగ్మూల్ తీసుకుని.. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విచారణ పేరుతో కుట్ర చేస్తోందని ఇంతకుముందే బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో అధికార పక్షం తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి చర్యలకు ఒడిగడుతోందంటున్నారు.