|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:38 PM
పెళ్లి అనగానే మొదట మొదలు పెట్టే పనుల్లో ఒకటి వెడ్డింగ్ కార్డుల ముద్రణ. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్నా.. కొద్దో గొప్పో పెళ్లి పత్రికలు మాత్రం కొట్టిస్తున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు పెళ్లి పత్రికలు ముద్రించడం ఆనవాతీగా వస్తుంది. అయితే ఈ పత్రికలపై సాధారణంగా దేవుళ్ల చిత్రపటాలు, సంప్రదాయబద్ధమైన అలంకరణలు కనిపిస్తాయి. కానీ మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనల్లో కూడా సంచలనాత్మక మార్పులు వస్తున్నాయి. వివాహం అనేది ఎవరి జీవితంలో అయినా.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.
వివాహ వేడుకను పదికాలాల పాటు అందరూ గుర్తుంచుకోవాలని ప్రతి చిన్న విషయంలోనూ వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆహ్వాన పత్రికల విషయంలో ఇప్పుడొక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొందరు తమ రాజకీయ అభిమానాన్ని.. మరికొందరు తమ సామాజిక స్పృహను చాటుకుంటూ కార్డులు డిజైన్ చేయించుకుంటున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక పెళ్లి పత్రిక చూస్తుంటే అసలు పెళ్లి పత్రికలు ఇలా కూడా చేస్తారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ కార్డును చూసిన వారు ఒక్క క్షణం అవాక్కవుతున్నారు. ఇది శుభలేఖనా లేక మరేదైనా మెడిసిన్‌కు సంబంధించిన అట్టానా.. అని గందరగోళానికి గురవుతున్నారు. ఈ జంట తమ వివాహ ఆహ్వానానికి చేసిన వినూత్న ఆలోచన ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన కిన్నెర నవీన్ వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన వివాహం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో నిశ్చయమైంది. శిరీష కూడా ఫార్మసిస్ట్‌గా వైద్య రంగంలోనే కొనసాగుతున్నారు. వధూవరులిద్దరూ ఒకే రంగానికి చెందిన వారు కావడంతో.. తమ పెళ్లి పిలుపు కూడా వినూత్నంగా ఉండాలని ఆలోచించారు. ఈ క్రమంలోనే నవీన్ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. అచ్చం మాత్రల స్ట్రిప్ ఎలా ఉంటుందో అదే మాదిరిగా తన పెళ్లి పత్రికను తయారు చేయించారు. ఈ కార్డును దూరం నుంచి చూసిన ఎవరైనా అది కచ్చితంగా ఏదైనా వ్యాధికి వాడే టాబ్లెట్ స్ట్రిప్ అని అనుకుంటారు. కానీ నిశితంగా గమనిస్తే అందులో పెళ్లి వివరాలు ఉండటం కనిపిస్తుంది.
మాత్రల అట్టపై ఉండే ఎక్స్‌పైరీ డేట్ స్థానంలో వివాహ ముహూర్తాన్ని.. మెడిసిన్ పేరు ఉండే చోట వధూవరుల పేర్లను ముద్రించారు. ఔషధాల తయారీలో వాడే రసాయనాల ఫార్ములా రాసే దగ్గర పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ అందులో వ్యాఖ్యలను పొందుపరిచారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న వీరి వివాహం గురించి ఈ వెరైటీ కార్డు ద్వారా తెలియజేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. తమ వృత్తికి ఇస్తున్న గౌరవం చూసి నెటిజన్లు ఈ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అలాంటిది ఈ మెడికల్ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు ఫార్మా రంగంలోని వారినే కాకుండా సామాన్య ప్రజలను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. చాలా మంది దీనిపై మీమ్స్ కూడా చేస్తున్నారు. టాబ్లెట్ లాగా కనిపించే వెడ్డింగ్ కార్డు అంటూ వైరల్ చేసేస్తున్నారు. వినూత్న ఆలోచనకు నిదర్శనంగా నిలిచిందంటూ తెగ లైక్స్ చేస్తున్నారు.