|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:24 PM
తెలంగాణలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం లభించింది. 2026 జనవరి షెడ్యూల్ కింద దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి అధికారులు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మొత్తం నియామకాల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోస్టల్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 609 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్లో తెలంగాణలోని డివిజన్ల వారీగా ఖాళీలను పొందు పరిచారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శిస్తే సరిపోతుంది. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నియామక ప్రక్రియలో ప్రధానంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , డాక్ సేవక్ అనే మూడు విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తెలంగాణలో ఉన్న 609 ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లాంటిది ఉండదు. కేవలం అభ్యర్థులు తమ పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మీరు దరఖాస్తు చేసుకున్న ఏరియాలో వచ్చిన దరఖాస్తుల్లో మీకు మెరిట్ మార్కులు వస్తే.. మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. మీ అర్హతకు సంబంధించి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే.. ఆ ఉద్యోగం మీకు వచ్చినట్లే. ఎంపికైన వారికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హోదాలో నెలకు రూ. 12,000 నుండి 29,380 వరకు, ఇతర పోస్టులకు 10,000 నుండి 24,470 రూపాయల వరకు వేతనం అందుతుంది.
వయస్సు పరంగా 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగులు ఈ పోస్టులకు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ , ఇతర వెనుకబడిన తరగతులకు గరిష్ట వయస్సులో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఉత్సాహం చూపే యువతకు ఇది ఒక గొప్ప వేదిక.
కేవలం వంద రూపాయల నామమాత్రపు ఫీజుతో దరఖాస్తు చేసుకునే వీలుంది. ఎస్సీ, ఎస్టీ , మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి పూర్తి మినహాయింపు కల్పించారు. తెలంగాణకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తెలుగు భాష మాట్లాడటం, రాయడం రావాలి. అంతే కాకుండా.. కంప్యూటర్ వాడకం, సైకిల్ తొక్కడం వంటి నైపుణ్యాలను కలిగి ఉండాలి. ఫిబ్రవరి 18, 19 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన వారికి నేరుగా ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది.