|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:20 PM
తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి రవాణా శాఖ ఒక కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై షోరూమ్‌ల వద్దే వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో సదరు యజమాని తన బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్‌సి (IFSC) కోడ్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ట్రాఫిక్ చలానాలను నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచి కట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులు తాజాగా స్పష్టత ఇచ్చారు.
బ్యాంక్ వివరాలు అడగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం చలానాల వసూలు కాదని అధికారులు స్పష్టం చేశారు. వాహన యజమానులు ఇళ్లు మారినప్పుడు రవాణా శాఖ రికార్డుల్లో అడ్రస్‌ను అప్‌డేట్ చేయడం లేదు. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఏదైనా అత్యవసర సమయాల్లో వాహనదారుడిని గుర్తించడం కష్టమవుతోంది. బ్యాంక్ ఖాతాలో కస్టమర్లు తమ చిరునామాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటారు కాబట్టి.. బ్యాంక్ వివరాల ద్వారా వారి తాజా నివాస ప్రాంతాన్ని సులభంగా కనుగొనవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆర్సీ కార్డుపై ఉన్న పాత అడ్రస్‌ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంక్ ఖాతా అనుసంధానంతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రవాణా శాఖ క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఈ చర్చ పెరగడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో కఠినంగా ఉండాలని.. చలానా పడగానే ఆ జరిమానా మొత్తం నేరుగా వారి బ్యాంక్ ఖాతా నుండి కట్ అయ్యేలా ‘ఆటో డెబిట్’ విధానాన్ని తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు.. ప్రజల్లో క్రమశిక్షణ తీసుకురావడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి చలానాల కోసం కాదని అధికారులు చెబుతున్నప్పటికీ.. భవిష్యత్తులో దీనిని ఆటో డెబిట్ సిస్టమ్‌కు వాడుతారేమోనని వాహనదారులు సందేహిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు కట్ అయితే.. పొరపాటున పడే చలానాల విషయంలో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. రవాణా శాఖ ప్రస్తుతం దీనిని కేవలం అడ్రస్ ప్రూఫ్ కోసమే వాడుతున్నామని చెబుతోంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి సూచించిన విధంగా ఆటో డెబిట్ విధానం అమల్లోకి వస్తుందో లేదో వేచి చూడాలి.