|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:17 PM
దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేలా ఎరువులపై రాయితీని కేంద్ర ప్రభుత్వం పెంచిందని, ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతులు కూడా లబ్ధి పొందుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేంద్ర బడ్జెట్ పెరిగిందన్నారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌కు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రతి జిల్లాలో ఒక్కో బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీంతో తెలంగాణలోని 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరవుతాయని తెలిపారు. డేటా సెంటర్ల అభివృద్ధికి ఉపయోగపడే కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుందని, డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు కూడా లాభం చేకూరుతుందని అన్నారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులపై విధించే పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించామని, దీనివల్ల తెలుగు విద్యార్థులకు పెద్ద మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రైల్వే బడ్జెట్‌ను రూ.2.77 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రానికి మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయని చెప్పారు. మెట్రో రైలు విషయంలో బడ్జెట్‌లో ప్రత్యేక ప్రస్తావన ఉండదని, డీపీఆర్ ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదంతో నిధులు విడుదలవుతాయని, ప్రస్తుత మెట్రో ప్రాజెక్టు టేకోవర్ ప్రక్రియ పూర్తిచేసి డీపీఆర్ అందిస్తే కేంద్రం ఆమోదం ఇస్తుందని తెలిపారు.