|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:34 PM
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలాగే వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిన్న రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలారని అన్నారు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకువస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, మేడారం జాతర ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వారు చెబుతున్న అబద్ధాలు ఒక్కటొక్కటి తేలిపోతున్నాయని అన్నారు. మొదట వ్యాపారవేత్తలు, ఆ తర్వాత సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారని, ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు లేదని స్వయంగా కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇకనైనా పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.