|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:21 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ, సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్‌లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్ -10 దేశాల జాబితాను మస్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఐఎమ్ఎఫ్ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, ప్రపంచ జీడీపీలో 26.6 శాతం వాటాతో చైనా తొలి స్థానంలో నిలిచింది. 17 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉండగా, కేవలం 9.9 శాతం వాటాతో అమెరికా మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా చూస్తే చైనా, భారత్‌లు కలిపి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 43.6 శాతం వాటాను కలిగి వున్నాయి. ఈ గణాంకాలను ప్రస్తావించిన మస్క్.. ప్రపంచంలో పవర్ చేతులు మారుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.