|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 07:29 PM
మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో చిరంజీవి 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ చిత్రం విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా తన వెన్నంటి ఉన్నవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకాదరణతో చిత్రం అపూర్వ విజయం సాధించడంతో తన మనస్సు కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు.తన జీవితం ప్రేమాభిమానాలతో ముడిపడి ఉందని, అభిమానులు, తెలుగు ప్రేక్షకులులేనిదే తాను లేనని, వారివల్లే తాను ఇంతటివాడ్నయ్యానని ఈ విషయాన్ని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించారని ఆయన అన్నారు. ఈ విజయం పూర్తిగా తన ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, తన ప్రాణసమానమైన అభిమానులదని ఆయన పేర్కొన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు, సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ విజయం దక్కుతుందని ఆయన అన్నారు. దశాబ్దాలుగా తన వెంట నిలబడిన ఎంతోమందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.వెండితెరపై తనను చూడగానే అభిమానులు వేసే విజిల్స్, చప్పట్లు తనను ముందుకు నడిపిస్తున్నాయని ఆయన అన్నారు. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయని, కానీ అభిమానలు తనపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతమని ఆయన అన్నారు. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక దర్శకుడు, నిర్మాత, సినిమా కోసం పనిచేసిన సభ్యులందరూ ఉన్నారని ఆయన కొనియాడారు.ఈ సంబరాన్ని ఇలాగే కొనసాగిద్దాం మీ అందరికీ ప్రేమతో, లవ్ యూ ఆల్" అంటూ ఆయన ముగించారు.
Latest News