|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:46 AM
ప్రతి శుక్రవారం సినిమా రంగంలో హీరోల స్టేటస్ మారిపోతూ ఉంటుంది. నిన్నటి వరకూ అగ్రతారగా వెలుగొంది హీరో ఒక్కసారిగా పరాజయంతో వెనకబడిపోతాడు. ఎక్కడో చివరి స్థానంలో ఉన్న యంగ్ హీరో శుక్రవారం విడుదలైన సినిమా ఘన విజయం సాధించడంతో తారాపథంలోకి దూసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ , ప్రదీప్ రంగనాథన్ పరిస్థితి అలానే ఉంది.నిన్న మొన్నటి వరకూ శివ కార్తికేయన్ కు తమిళనాట తిరుగులేదు. వరుస విజయాలతో శివ కార్తికేయన్ దూసుకుపోతూ వచ్చాడు. తమిళంలోనే కాదు తెలుగులో అతని సినిమాలు విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా 'డ్రాగన్' , 'డ్యూడ్' సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండూ కూడా హిట్టే. దాంతో ఒక్కసారిగా ప్రదీప్ రంగనాథన్ పట్ల జనాలలోనే కాదు బయ్యర్లలోనూ క్రేజ్ ఏర్పడింది. ఇక శివ కార్తికేయన్ నటించిన 'డాక్టర్, డాన్, అమరన్ వంటి సినిమాలు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా విజయం సాధించాయి. మధ్యలో వచ్చిన 'ప్రిన్స్' ఓ మాదిరిగానే ఆడింది. మళ్ళీ 'మావీరన్' విజయం సాధించగా, 'అయలాన్' ఫ్లాప్ అయ్యింది.గత యేడాది ద్వితీయార్థంలో వచ్చిన శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా నిరాశకు గురిచేసింది. వంద కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇక సంక్రాంతికి వచ్చిన 'పరాశక్తి' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇంకా రూ. 80 కోట్ల దగ్గరే కొట్టుమిట్టాడుతోంది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందా అనే సందేహాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రదీప్ రంగనాథన్ నటించిన 'లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్' అన్నీ వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ స్థానాన్ని ప్రదీప్ రంగనాథన్ అందుకుంటాడనే ప్రచారం కోలీవుడ్ లో బాగా జరుగుతోంది.
Latest News